Wednesday, 7 December 2011

కొత్త తరం తల రంగు ఫేషన్లు

కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మని మొదటిసారి చూసి వాట్ ఏ బ్యూటీఫుల్ యంగ్ విడో అని గిరీశం తనలో అనుకొంటాడు, మా అక్కే జుట్టుకు చవుర్రాసుకోదు అంటాడు వెంకటేశం. ఆ తరువాత గిరీశం వితంతువులు తలకి నూనె రాసుకోరని, ఆ విధంగా తలకు నూనె రాసుకోకపోవడం వల్ల జుట్టు ఎర్రగా పీచులా తయారవుతుందని తన శిష్య పరమాణువుకి వివరిస్తాడు. అది వేరే కథ.

ప్రస్తుతం వస్తున్న రక రకాల జుట్టుకు వేసే రంగుల ప్రకటన్లు చూసిన తరువాత మళ్ళీ మనం బుచ్చమ్మ జుట్టు రంగునే ఫేషన్ గా అనుకొనే పరిస్తితి దాపురిస్తుందని ఎవరూ అనుకకొని ఉండరు. కానీ నేడు టీవీలలో వస్తున్న ప్రకటన్లు అలాగే ఉంటున్నాయి. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకం రాసే నాటికి విధవలకి అయితే గుండు గీయించేవారు లేదా బుచ్చమ్మ లాంటి బాల వితంతువు అయితే కొన్ని సార్లు గుండు గీయించకుండా తైల సంస్కారం లేకుండా జడ వేసుకోకుండా నిర్బంధించేవారు.

కానీ నేడు నాగరికం పెరిగిన ఈ రోజులలో తలకి తైల సంస్కారం అనేది ఒక అనాగరిక చర్యగా భావిస్తూ స్త్రీ, పురుష భేదం లేకుండా బుర్ర గొరిగించుకోవడమో లేదా తలకి వారానికి ఒక సారి గోరింటాకు రుబ్బి పూసుకోవడమో లేదా తలకి బుచ్చమ్మ జుట్టు రంగు వేసుకోవడమో ఫేషన్గా మారి పోయి చక్కగా జడ వేసుకొన్న స్త్రీని చిన్న చూపు చూసే పరిస్థితి దాపురించిందని తెలిస్తే గురజాడ అప్పారావు గారు ఖచ్చితంగా ఉరిపోసుకోవడం ఖాయం.

 బజార్లో ఏవేవో కంపెనీల పేర్లతో తలకి రంగువేసుకోవడానికి పనికివచ్చే వేర్వేరు పొడులు, అరకులూ చాలానే ఉన్నాయి. అందులో ఈ బుచ్చమ్మ రంగుకూడా దొరుకుతోంది.మన పూర్వపు కవులు మరియూ కొంతమంది నాలాంటి ఛాందసులు ఈ రకమైన పోకడలని చూసి బాధ పడడం మినహా ఏమీ చేయలేని పరిస్తితి. ఒకప్పుడు దక్షిణ భారత దేశంలోని స్త్రీలు జుట్టు కత్తిరించడమంటే ఘోర పాపంగా తలచేవారు. ఇప్పుడు జుట్టు కత్తిరింపునకు నోచుకోలేదని తెలిస్తే మిగిలిన స్త్రీలు వారిని అవహేళన చేసే స్థాయికి ఎదిగి పోయాం. తలకి  రంగు వేసుకోవడం కొద్దిరోజులు ఆలస్యమయితే పూర్వం పంచరంగుల సినిమాలు వచ్చేవి ఆ విధంగా తల మీదే పంచ రంగులు కనిపిస్తాయి.

నాలాంటి ధరఖర్వాటుడి లాంటి వాడిని వదిలేస్తే, ఆడ కానీ మగ కానీ ఒక వయసు వచ్చాక జుట్టు కాస్త నెరిసినట్లు కనిపిస్తేనే చమక్ ఉంటుంది. మరీ 20 ఏళ్ళు నుండి 40 ఏళ్ల లోపులో వారు జుట్టు నెరిసిపోతోందని నల్లటి రంగు వేసుకోవడం బాగానే ఉంటుంది కానీ మరీ ఏదో ప్రకటనలో కరీనా కపూర్ జుట్టు రంగు బుచ్చమ్మ జుట్టు రంగు వేసుకొంటే అందం మాట ఎలా ఉన్నా డోకు రావడం మాత్రం ఖాయం.