Wednesday 11 April 2012

ఓట్స్ తోనే టిఫిన్ చేస్తారా?

నా చిన్నతనం లో ఎవరైనా ఉదయంపూట పరిచయస్తులు కలిస్తే లేదా ఇంటికి వస్తే మా తల్లి గారు, మా అమ్మమ్మ గారు లేదా మా నాయనమ్మ గారు కుశల ప్రశ్నలు అవీ పూర్తయ్యాక వాళ్లకి అల్పాహారాల విషయానికి వస్తే అవతలి వాళ్ళు వద్దు, మేము టిఫేన్ (టిఫిన్ కాదు)  చేసాం మొర్రో అంటే కూడా వినిపించి కోకుండా అప్పటికప్పుడు తయారు చేయడమో లేదా ఇంట్లో ఏదైనా తయారు చేసినది పెట్టడమో చేసేవారు. ఒక వేళ అది మధ్యాహ్న సమయం అయితే కూడా అదే వ్యవహారం.  ఆ రోజుల్లో ఎక్కువగా బియ్యం తో సంబంధించిన రకాలు టిఫిన్ గా చేసేవారు. దానికి కారణం గోధుమలు, గోధుమ పిండి ఇంకా మిగలిన రకరకాలైన తృణ ధాన్యాలు మన ఆంద్ర దేశంలో దొరకడం తక్కువ. వాటిల్లో ముఖ్యమైనది కొయ్య రొట్టి, కొబ్బరి రొట్టె లాంటివి మా ఇంట్లో చాలా ఫేమస్. వాటి తయారీ కూడా సులభమే. కొయ్య రొట్టె చేయడం నా శ్రీమతికి కూడా నేర్పుకోన్నాను. అలాగే కొబ్బరితో కలిపి చేసే కొయ్య రొట్టి. ఆ రకమైన టిఫెన్లు ఇప్పుడు లుప్తమయి పోయాయి.


ఈ రోజుల్లో ఎవరిని కలిసినా టిఫిన్ చేసావా అనడిగితే ఆ చేసాను అని మనం చాలా గొప్పగా చెబుతూ ఉంటాం ఏం టిఫిన్ చేసావు అని అడిగితె ప్రస్తుత సమయం లో ఓట్స్ తిన్నాను అని చెప్పడం చాలా ఫేషన్ గా మారింది. అసలు ఈ ఓట్స్ కథా కమామిషు కొంత చూద్దాం. బ్రౌణ్యం ప్రకారం చలి దేశాలలో పండే తృణ దాన్యాలవంటి పంట ముఖ్యంగా గుర్రాలకి దాణాగా పనికి వస్తుంది అని ఉంటుంది. ఈ ఓట్స్ స్కాట్లాండ్ లో గుర్రాలకి పెట్టేది గానే ఉంటుంది. ఇంక ఈ ఓట్స్ ని విదేశాల నుండి దిగుమతి చేసుకొని వాటిని ఆకర్షణీయమైన పోట్లాలలో పెట్టి అరకిలో పొట్లం `50/- లు లేదా ఇంకా ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి. నేను యశోద ఆసుపత్రి నుండి చికిత్సానంతరం వారం రోజుల తరువాత ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకొనే మొదటి వారం లో మా ఆవిడ పెద్దమ్మగారి కొడుకు ఈ ఓట్స్ పొట్లం ఒకటి తెచ్చి ఇది పాలల్లో కలిపి పెట్టు బలం వచ్చి భీముడిని మించిపోతాడు మీ ఆయన అంటే నాలుగు రోజులు ఆ విధంగానే ఒకసారి పాలల్లో కలుపుకొని, ఇంకోసారి పులిహోర లాగా వండించుకొని నేనుకూడా తిన్నాను. ఆ తరువాత మళ్ళీ చెకప్ కి యశోదా ఆసుపత్రి కి వెళ్ళినప్పుడు అక్కడి వైద్యుడు నిన్న ఆహారంలో ఏమి తిన్నావు అని అడిగినప్పుడు ఈ ఓట్స్ విషయం చెబితే నిన్ను ఓట్స్ తినమని ఎవరు చెప్పారు? అందులో అంత బలం ఉందని ఎవరు చెప్పారు అని నన్ను నానా బూతులు తిట్టి పోశారు. ఆ తరువాత వ్యవసాయ శాస్త్రంలో ఉద్యానశాఖలో స్నాతకోత్తర (M.Sc (Hort.)) పట్టా పొందిన కాన్పూరు స్నేహితుడు శ్రీ కనోజియా ని ఈ ఓట్స్ కథా కమామిషు అడిగితె అతను చెప్పినది ఈ ఓట్స్ అంత గొప్ప బలవర్ధకమైనది కాదు దానిలో మన బియ్యంతో చేసిన అటుకులు లేదా మొక్క జొన్న తో చేసిన ఫ్లేక్స్ లో ఉన్నంత పోషక విలువలే ఉన్నాయని చెప్పారు. కానీ మన టీవీలలో లంగారంమలు, వంటకత్తెలూ ఓట్స్ తినని వాడు వచ్చే జన్మలో గాడిద గా పుడతాడు అన్నంత ప్రచారం చేసి ప్రజలని తప్పు దారి పట్టిస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద కంపెనీల్లు కూడా ఈ విషయంలో తక్కువేమీ తినలేదు. అసలు తింటే ఒట్సే తినాలి లేకపోతె బతుకేలేదు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. 


అటుకులు తింటే నామోషీ. ఓట్స్ తింటేనే సోసయిటీలో మనిషి అన్న విధమైన బిల్డప్ ఆపితే మంచిది. అమ్మా లంగరమ్మలూ, లంగరయ్యలూ మరియూ కుహనా వైద్యులు, మీరు ఈ విధమైన అసత్య ప్రచారాలు ఆపి మన దెస పంటలు అయిన అటుకులు, రాగులు, సజ్జలు, జొన్నలు తినేట్లుగా ప్రోత్సహించండి. ఇదే మిమ్మల్ని కోరే నా విన్నపం. అందరూ నాలాగా జిజ్ఞాసతో వైద్యుడిని లేదా శాస్త్ర వేట్టాలని కనుక్కోకపోవచ్చు. వారిని మీ తప్పుడు సమాచారంతో మోసగించకండి.