Saturday, 30 July 2011

గురజాడ వారి కన్యాశుల్కం నేటి సమాజానికి సజీవ దర్పణం

కన్యాశుల్కం నాటకం శ్రీ గురజాడ అప్పారావు గారు రాసిన కాలానికి మిగిలిన కులాలలో లేని విధంగా బ్రాహ్మణులలోనే ఈ కన్యాశుల్కం అనే జాడ్యం ఉండేది అని తెలుస్తోంది. మిగిలిన జాతులలో దీని గురించి ప్రస్తావన ఎక్కడా కనిపించదు. అంటే ఈ కన్యాశుల్కం అనే అనాచారం ముఖ్యం గా ఆనాటి పెద్ద కులము అనే బ్రాహ్మణుల వరకే పరిమితం. కానీ నేడు వరకట్నం అనే పిశాచం అన్ని కులాలోనూ ఉన్న జాడ్యం. అప్పుడు ఏదో ఒకటో రెండో కులాలు లేదా తెగలకు పరిమితమైన కన్యాశుల్కం, శ్రీగురజాడ అప్పారావు గారు, శ్రీకందుకూరు వీరేశళింగం పంతులు మొదలైన సాంఘిక సంస్కర్తలు చెసిన ప్రయత్నాల వలన ఈ దురాచారం సమసిపొయింది. కానీ నేడు వరకట్నం రూపంలో అన్ని కులాలనూ ఎంతగానో బాధిస్తోంది.

ఇందులోని పాత్రలు వాటి స్వరూపం ఎలా ఉందొ చూస్తే నాటి జీవన విధానం తెలుస్తుంది. నేటి నాగరిక జీవితం అనుకొంటున్న మనం మన వేషం, మాట్లాడే భాష లేదా యాస మారి ఉండవచ్చుగాక కానీ మానవ మనస్తత్వం నేటికీ అలాగే ఉందన్నది తెలుస్తోంది. అందుకే ఈ నాటకం లోని పాత్రలు సజీవ చిత్రాలై మన ముందు సాక్షాత్కరిస్తాయి.

గ్రామ మునసబు సారా కొట్లో సారాయి తాగుతూ 'అన్నా ఈ రండా గర్భాలు బ్రాహ్మల్లో కొత్త కాదు కదా' అంటూ ఇంకొక విషయం కూడా చెప్తాడు "మనలో ఈ బెడద లేదు ఎందుకంటే మారు మనువులు ఉన్నాయి'. ఆ విధంగా విధవా వివాహాన్ని ఒక సామాన్య మానవుడు ప్రోత్సహించడం ఆనాటి బ్రాహ్మణ కుటుంబాల లోని డొల్లతనాన్ని బయట పెట్టింది.

అన్ని రకాల తప్పులు చేసి వేశ్య ని ఉంచుకొన్న పెద్దమనిషి రామప్ప పంతులు. అయినా ఈ పాత్ర తాను చెడు తిరగుళ్ళు తిరిగే మరొక విధవ లుబ్ధావధానులు కూతురు మీనాక్షితో ఎంతైనా బ్రాహ్మలం అంటాడు. అంటే ఈ తప్పుడు పనులు చేసే వాళ్లు తమ తప్పిదనాన్ని కప్పుకోవడానికి కులాన్ని అడ్డుపెట్టుకోవడం అప్పుడూ ఉంది, ఇప్పటికీ ఉంది. ఇంక ఆంగ్లభాషా వ్యామోహం ఎప్పుడూ ఉంది. ఆంగ్లభాష ఏదో దైవాంశ భాష అనే భ్రమ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది.

ఇంక వేశ్యా వృత్తి చేసుకొనే మధురవాణి ది ఒక ఉదాత్తమైన పాత్ర. తాను పుట్టింది వేశ్యా కులంలో నైనా, తన పరిధిలో తనకు తోచిన విధంగా ప్రతి వారికి న్యాయం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందులోని భాగం గానే కరటక శాస్త్రులు శిష్యుడికి ఆడ పిల్ల వేషం లో లుబ్ధావధానులు తో వివాహం చేయించడం. ఆ తర్వాత, అదే లుబ్ధావధానులు ఆపదలో ఉన్నాడని జాలి పడి ఒక న్యాయమైన వకీలు సౌజన్యా రావు పంతులు వద్దకు వెళ్ళడం.

ముఖ్యమైన పాత్ర గిరీశం విషయానికి వస్తే, ఇలాంటి గోముఖ వ్యాఘ్రాలు అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ మనకు తగులుతూనే ఉంటారు. పైకి అందరికి తాను వేశ్య వృత్తి నివారణ కోసం పాతుపడుతున్నట్లు గా నటిస్తూ, నాటకంలోని మధురవాణి అనే వేశ్యా సంపర్కం కలిగి ఉండడం ఈ పాత్ర ప్రత్యేకత. అందరిని మోసం చేసినట్లుగానే, అమాయకురాలైన బుచ్చమ్మని దారి తప్పించి తన స్వార్థం కోసం వినియోగిన్చాదల్చుకోవడం పైగా విధవా వివాహాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా నటించడం ఈ పాత్ర లక్షణం. తన పొట్ట కూటి కోసం రక రకాలైన అబద్ధాలు చెప్పడం ఈతడు ఎంచుకొన్న మార్గం. ఈ గిరీశం చదువులేని వాడేమీ కాదు. ఆ రోజులలో ఎఫ్ ఏ (అంటే ఈ రోజులలో ఇంటర్మీడియేట్ తో సమానం) చదువుకొన్న వ్యక్తి. కానీ మోసం చేయడమే ఈ పాత్ర యొక్క బలహీనత.

ఇంకొక పాత్ర సిద్ధాంతి. ఈ సిద్ధాంతి రామప్పంతులు కి అన్ని రకాలైన చెత్త పనులలోనూ సహాయ పడుతూ ఉంటాడు. అందుకే రామప్పంతులు ఈ వెధవ ఊళ్ళో సిద్ధాంతి ఆడింది ఆటా పాడింది పాటగా పూటకో మాట మాట్లాడతాడు అని ఒకానొక సందర్భంలో అంటాడు. అంటే, వైదిక వృత్తి చేసే చాలామంది బ్రాహ్మణులు ఈ సిద్ధాంతి లాగా ఇష్టం వచ్చినట్లు చరించడం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉంది.

ఇంక చీటికి, మాటికి కోర్టుల చుట్టూ తిరిగే కోర్టు పక్షులు ఎప్పడూ ఉన్నాయి. ఇందుకు రామప్పంతులు, అగ్నిహోత్రావధానులే ఉదాహరణ. ఇద్దరూ కోర్టు పక్షులే. ఇంక నాటి పొలిసు వ్యవస్థని తీసుకొంటే, పోలీసులంటే ప్రజలలో భయాలు అప్పటికే నాటుకుపోయి ఉన్నాయి.

ఇంకొక ముఖ్య పాత్ర బుచ్చమ్మ. ఈమె అగ్నిహొత్రావధానులు మరియూ వెంకమ్మల ప్రథమ పుత్రిక. ఈ బుచ్చెమ్మ బాల్య వితంతువు. అగ్నిహొత్రావధానులు ధనాపేక్ష చేత కన్యశుల్కానికి ఒక ముదుసలికి ఇచ్చి వివాహం జరిపిస్తే ఆ ముదుసలి తాళి కట్టిన వెంటనె పెళ్లి పీటల మీద చనిపొతే బుచ్చమ్మ వితంతువు అయ్యింది. అ రొజులలొ బ్రాహ్మణ వితంతువులు ఎవరూ తలకు నూనె రాయడం సౌందర్య సాధనాలని ఉపయోగించడం నిషిద్ధం మరియూ ఒక్క పూటే భొజనం చెయాలి. రాత్రి భొజానానికి మారుగా ఎదో మినప రొట్టె కాల్చుకొని లెదా ఉప్పుడు పిండి చెసుకొని తినేవారు. వీరిని సమాజంలొ చాలా చిన్న చూపు చూసేవారు. ఇక కథలొకి వస్తే ఈ బుచ్చమ్మ అమాయకురాలు మరియూ తండ్రి చాటు బిడ్డ. ఈమెని వలలొ వేసుకోవాలని మన నాటక హీరొ గిరీశం ఈనాటి కుర్రకారు ఆడపిల్లలని తమ దారికి తెచ్చుకొవాలనే విధంగా చెయవలసిన చేష్టలు అన్నీ చేసి ఈమె చెల్లెలి పెళ్లికి వెళ్లె దారిలొ ఈమె ఎక్కిన బండిని మిగిలిన వారి నుండి దారి తప్పించడం గిరీశం యొక్క కుటిలత్వాన్ని, బుచ్చమ్మ యొక్క అమాయకత్వాని తెలియ చేస్తుంది.

ఇంత చక్కటి పాత్రల చిత్రీకరణతో నాటి సమాజపు దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి, నేటికీ మాన మనస్తత్వాలు మరియూ మానవ సంబంధాలు ఆ విధంగానే రకరకాల మనుషులు ఉన్నారని తెలియచేస్తోంది. అందుకే ఈ నాటకం నేటికీ సజీవ శిల్పంగా నిలిచింది.

No comments:

Post a Comment