Sunday 18 September 2011

సినిమా రికార్డింగ్ డాన్సులుని మించిపోయిన నేటి టీవీ నాట్య పోటీలు

ఇప్పుడే తీన్ మార్ అని ఒక నాట్య కార్యక్రమం జీ టీ వీలో చూసాను. అది చూసాక, ఇంతకు ముందు కొన్ని టీవీ నాట్య కార్యక్రమాలని మా, జెమిని, ఈ టీవీ ఇంకా కొన్ని నేషనల్ చానెల్స్ అయిన సోనీ, జీ, స్టార్ వంటి ప్రైవేట్ చానెళ్ళలో చూసిన తరువాత ఈ బ్లాగు రాయాలని అనిపించింది.

నా చిన్నతనం లో ఏదైనా పండుగలు, సంబరాలు, తీర్థాలు లేదా జాతరలు జరిగినప్పుడు ఆ జాతరలలో లేదా నవరాత్రుల ఉత్సవాలలో ఒక రోజు లేదా రెండు రోజులు సిని రికార్డింగ్ డాన్సులు పెట్టేవారు. ఆ విధంగా సినీ రికార్డింగ్ డాన్సులు చేసే సంస్థలు కొన్ని కాస్త పెద్ద పట్టాణాలయిన రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు భీమవరం లాంటి పట్టణాలలో ఉండేవి వాళ్ళు వచ్చి వేదిక మీద సినిమా పాటలకు తగ్గట్లుగా నాట్యం చేసేవారు. ఆ విధంగా వాళ్ళు తాము బతకడమే కాక తమ మీద ఆధార పడ్డ కుటుంబాలనూ పోషించుకోనేవారు. ఇంతా చేస్తీ వాళ్ళు తీసుకొనే మొత్తం చాలా తక్కువ. రాను, రాను ఈ సినీ రికార్డింగ్ డాన్స్ ల్లో అశ్లీలం ఎక్కువయ్యేసరికి వాటిని నిషేధించారు. దాని వలన చాలా మంది రికార్డింగ్ డాన్స్ కళాకారులకి ఉపాధి పోయింది వాళ్ళు వేరే వృత్తులని చేపట్టడానికి ప్రయత్నించి అందులో సఫలీకృతులు కాలేక వేరే పని ఏదీ చేత కాక అత్యంత దుర్భర హైన్య జీవితాలు అనుభవిస్తున్నారు. అది వేరే విషయం.

మన రాజ్ న్యూస్ లేదా టీ టీవీ వారు కోస్తా ప్రాంతంలో సినీ రికార్డింగ్ డాన్సులు చేసారని కొన్ని నెలల క్రితం వార్త ని ప్రసారం చేసారు. ఆ టీవీ వారిని నేను తప్పు పట్టను ఎందుకంటే సినీ రికార్డింగ్ డాన్సులు నిషేధం. అందుచేత వారు దానిని విమర్శనాత్మకంగా ప్రజలలో చైతన్యం కోసం ప్రసారం చేసారు.

ఇంక ప్రస్తుత విషయానికి వస్తే, మన టీవీ కార్యక్రమాలలో వచ్చే నాట్య పోటీల కార్యక్రమాన్ని చూస్తే ఆ పోటీలు పెట్టిన వారిని నిలువునా చీరేయాలని ఎవరికైనా అనిపిస్తుంది . పూర్వం పొట్టకూటికోసం తప్పక గత్యంతరం లేక సినీ రికార్డింగ్ డాన్స్ లు చేసేవారు. కానీ టీవీ పోటీలలో దానిని మించి పోయి సభ్య సమాజం సిగ్గుతో అసహ్యించుకొనే విధమైన వేషధారణ, దానితో పాటుగా భార్యా పిల్లలతో చూడలేని విధంగా చిన్న పిల్లలు లేదా కాస్త పెద్ద వయసు పిల్లలు చేసే కామకేళీ విన్యాసాలు. ఆ చిన్న పిల్లలు చేసే వాత్స్యాయన కామ భంగిమల్ని చూసి చొల్లుకార్చుకొనే న్యాయనిర్ణేతలు. అంతే కాకుండా ఇంక ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వ్యాఖ్యాతల దుస్తుల్ని చూస్తే కాస్తలో కాస్త మగ వ్యాఖ్యాతల వేషధారణ నయం కానీ ఆడవారి వేషధారణని చూస్తే అప్పుడే పడకటింటిలో కామకేళి ముగించి పొరబాటున అదే వేషధారణ తో బయటకు వచ్చిన వనితని మరిపిస్తూ, చూసే వారిని కవ్విస్తూ చేసే వ్యాఖ్యానాలు పరమ రోతగా ఉన్నయని చెప్పక తప్పదు. ఈ కార్యక్రమాలని చూడడానికి వచ్చిన ప్రేక్షకులు అంతా టీనేజ్ పిల్లలు మరియూ వారి తల్లిదండ్రులు. వాళ్లు ఈ కార్యక్రమాన్ని ఒళ్లు కొవ్వెక్కి, తిన్నది అరగక ఒక్కసారిగా తమ పిల్లలు పేరు ప్రతిష్టలు తెచ్చేసుకొని గొప్పవారైపోవాలని తమ పిల్లలని ఈ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వారిని ప్రోత్సహిస్తూ, వాళ్లకి కామకేళి విన్యాసాలలో తాము తీర్చుకోలేని భంగిమలు నేర్పిస్తున్నారే తప్ప ఏవిధమైన కళకూ న్యాయం చేయడం లేదు. ఈ కార్యక్రమాలలో పాల్గొని కప్పులు సాధించడానికి పిల్లలకు, పెద్దలకు తర్ఫీదు నిచ్చే శిక్షణా సంస్థలు కూడా ఉన్నాయి అంటే ఆశ్చర్య పోయాను. ఈ విధమైన సినీ రికార్డింగ్ డాన్సులు పూర్వం ఏదో పండగలకి, తీర్థాలాలోనూ చూపించేవారు. కానీ నేడు మన టీవీలలో ఇంచుమించు ప్రతి రోజూ ఏదో ఒక టీవీ చానెల్ ఈవిధమైన్ అశ్లీల నృత్య కార్యక్రమాలు చూపిస్తున్నాయి.

టీవీ చానెళ్లలో చూపించే నాట్య పోటీల కార్యక్రమాలలో అశ్లీల నాట్యాలని నిషేధిస్తూ కొన్ని మౌలిక, న్యాయ, సూత్రాలని, నియమ నిబంధనలని నిర్దేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని, మానవ హక్కుల సంస్థల వారిని, సెన్సార్ బోర్డు వారిని మరియూ నేషనల్ టీవీ అసోసియేషన్ వారిని కోరుతున్నాను.

3 comments:

  1. television shows are boring these days...these channels should enlighten the telugu people more about science and technology, rather than clumsy dance baby dance...etc

    ReplyDelete
  2. It is a very good suggestion to enlighten the public. Thank you very much Tallamraj garu.

    ReplyDelete
  3. ఒకప్పుడు రికార్డింగ్ డ్యాన్సులపై న్యూస్ ఇచ్చే వాళ్ళే ఇలాంటివి నిర్వహించడం అదీ జుగుప్సాకరమైన రీతిలో ఉండటం ఈ మధ్య ఫ్యాషనైపోయింది...వీటికి ప్రేక్షకులనుంచి కూడా ఆదరణ పుష్కలంగా అభిస్తుండటంతో చానెల్స్ మధ్య పోటి తట్టుకోవడంకోసం దిగజారుడు కార్యక్రమాలు రొటీన్ అయిపోవడం విచారకరం....మంచి ఆర్టికల్ రవీంద్రనాద్ గారు..

    ReplyDelete